మణుగూరు: ప్రాథమిక ఆరోగ్య కేంద్రం–మణుగూరు పరిధిలోని వలస ఆదివాసీ గిరిజన గ్రామమైన పెద్దిపల్లిలో బుధవారం గృహ సందర్శన ద్వారా జ్వర సర్వే నిర్వహించారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నీటి నిల్వలు, పరిసరాల అపరిశుభ్రత కారణంగా జ్వరాలు, దోమల ద్వారా వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున ప్రజలకు పలు ఆరోగ్య సూచనలు చేశారు. ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఎక్కడా నీటి నిల్వలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బంది సూచించారు. కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలని, వలస గ్రామాలకు వెళ్లి తిరిగి వచ్చిన వారు ఆశా కార్యకర్తల ద్వారా రక్త పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. దోమల నివారణకు తప్పనిసరిగా దోమతెరలు ఉపయోగించుకోవాలని సూచించారు.అనంతరం గ్రామంలో హెల్త్ క్యాంప్ నిర్వహించి, వైద్య పరీక్షలు చేసి అవసరమైన మందులను పంపిణీ చేశారు. విజయనగరంలో వ్యాధి నిరోధక టీకాలు కూడా వేశారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ అనసూర్య, హెల్త్ అసిస్టెంట్లు రాంప్రసాద్, కృష్ణ, శైలజ, రోజా తదితరులు పాల్గొన్నారు.
పెద్దిపల్లిలో జ్వర సర్వే.. ప్రజలకు ఆరోగ్య సూచనలు
