పినపాక అభివృద్ధికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్కు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు వినతి
రోడ్లు, వంతెనల నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి
పినపాక: పినపాక నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేసి, రోడ్లు, వంతెనల నిర్మాణ పనులకు పరిపాలనా అనుమతులు కల్పించాలని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి శాఖ, గిరిజన సంక్షేమ శాఖ, వికలాంగులు, వయోవృద్ధులు మరియు ట్రాన్స్జెండర్ వ్యక్తుల సాధికారత శాఖల మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ను పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కోరారు. నియోజకవర్గంలోని మారుమూల, గిరిజన ప్రాంతాల్లో రహదారులు, వంతెనల సౌకర్యాలు పూర్తిస్థాయిలో లేకపోవడంతో ప్రజలు, రైతులు, విద్యార్థులు, రోగులు రవాణా విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే తెలిపారు. ముఖ్యంగా వర్షాకాలంలో పలు గ్రామాలకు రాకపోకలు కష్టతరంగా మారుతున్నాయని పేర్కొన్నారు. మణుగూరు, అశ్వాపురం, బూర్గంపాడు, కరకగూడెం, పినపాక, అల్లపల్లి, గుండాల మండలాల్లో ప్రజల అవసరాలకు అనుగుణంగా పలు బీటీ రోడ్లు, హై లెవల్ వంతెనల నిర్మాణ పనులు చేపట్టాల్సి ఉందని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ పనులకు ప్రభుత్వం త్వరితగతిన పరిపాలనా అనుమతులు మంజూరు చేయడంతో పాటు అవసరమైన నిధులను విడుదల చేయాలని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు విజ్ఞప్తి చేశారు. మౌలిక వసతుల అభివృద్ధికి నిధులు అందుబాటులోకి వస్తే నియోజకవర్గంలోని మారుమూల గ్రామాల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుందని తెలిపారు. కొత్త రహదారులు, వంతెనల నిర్మాణంతో రైతులు తమ పంటలను మార్కెట్లకు సులభంగా తరలించేందుకు, విద్యార్థులు విద్యాసంస్థలకు చేరుకునేందుకు, అత్యవసర సమయాల్లో రోగులను ఆసుపత్రులకు వేగంగా తరలించేందుకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పినపాక నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి మెరుగైన మౌలిక వసతులు కల్పించి, ప్రజల రవాణా సమస్యలను పరిష్కరించేందుకు తన వంతు కృషి నిరంతరం కొనసాగిస్తానని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తెలిపారు.
