9న మారెళ్లపాడుకు మంత్రుల రాక.. ప్రారంభోత్సవాన్ని ఘనంగా విజయవంతం చేయాలి: ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

29న మారెళ్లపాడుకు మంత్రుల రాక.. ప్రారంభోత్సవాన్ని ఘనంగా విజయవంతం చేయాలి: ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

ఏళ్ల తరబడి సాగునీటి కోసం ఎదురుచూస్తున్న రైతుల కల సాకారం

గోదావరి జలాలతో తుమ్మలచెరువు ఆయకట్టుకు కొత్త సాగునీటి భరోసా

మంత్రుల పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే పాయం, కలెక్టర్ అంకిత్

అశ్వాపురం, ఆగస్టు 27:
తుమ్మలచెరువు ఆయకట్టు రైతులు ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న మారెళ్లపాడు ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవానికి సమయం ఆసన్నం కావడంతో అశ్వాపురం మండలంలో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. ఈ నెల 29న రాష్ట్ర మంత్రుల చేతుల మీదుగా మారెళ్లపాడు ఎత్తిపోతల పథకం ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా, విజయవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నలమడ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా-శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ (సీతక్క) ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.

రైతుల కలను సాకారం చేసే చారిత్రక రోజు

మారెళ్లపాడు ఎత్తిపోతల పథకం ప్రారంభంతో అశ్వాపురం మండలంలోని అనేక చెరువులు, కుంటలకు గోదావరి జలాలు చేరనున్నాయి. అధికారికంగా మారెళ్లపాడు లెఫ్ట్ కెనాల్ ద్వారా 4,266 ఎకరాలకు, అదనంగా మరో 3,734 ఎకరాలకు సాగునీటి ప్రయోజనం కలగనుంది. మొత్తంగా లెఫ్ట్ కెనాల్ పరిధిలో సుమారు 8 వేల ఎకరాలకు నీటి ప్రయోజనం లభించనుంది.

రైట్ కెనాల్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే అధికారికంగా 11,915 ఎకరాలకు, అదనంగా సుమారు 4,500 ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉంది. రెండు కెనాళ్లు పూర్తిస్థాయిలో వినియోగంలోకి వస్తే మొత్తం సుమారు 24,415 ఎకరాలకు సాగునీటి ప్రయోజనం కలగనుంది. తద్వారా రైతులు రెండు పంటలు సాగు చేసుకునే పరిస్థితులు ఏర్పడి వ్యవసాయ రంగానికి మరింత భరోసా లభించనుంది.

రాజకీయాలకు అతీతంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

ఎన్నో ఏళ్లుగా సాగునీటి కోసం ఎదురుచూస్తున్న రైతుల కళ్లలో ఆనందభాష్పాలు చూసే రోజు దగ్గరపడిందని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. రైతుల ఆశలు, ప్రజల ఆకాంక్షలు నెరవేరుతున్న ఈ తరుణంలో రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కార్యక్రమంలో భాగస్వాములై ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

“రైతు కళ్లలో ఆనందం చూడటమే ఈ పథకం అసలు లక్ష్యం. ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెరదించి పొలాలకు నీరు అందించే రోజు ఇది. మారెళ్లపాడు ఎత్తిపోతల పథకం ప్రారంభం రైతుల జీవితాల్లో మరుపురాని మలుపుగా నిలవాలి. 29న జరిగే కార్యక్రమాన్ని రైతులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలి” అని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కోరారు.

మంత్రుల పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే, కలెక్టర్

మంత్రుల పర్యటన నేపథ్యంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్‌తో కలిసి గురువారం అశ్వాపురం మండలంలోని బీజీ కొత్తూరు హెలిపాడ్ ప్రాంతం, మారెళ్లపాడు ఎత్తిపోతల పథకం కెనాల్, సభా స్థలం తదితర ప్రాంతాలను పరిశీలించారు.

హెలిపాడ్ వద్ద జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం మంత్రులు ప్రారంభించనున్న ఎత్తిపోతల పథకం కెనాల్ పనులు, సభా స్థలంలో కొనసాగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. మిగిలిన పనులన్నీ సకాలంలో పూర్తి చేయాలని, కార్యక్రమానికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, పార్కింగ్, భద్రత, ఇతర మౌలిక వసతులు పకడ్బందీగా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ సీతారామ ప్రాజెక్టును పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకువచ్చి రైతులకు సాగునీరు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. మంత్రుల పర్యటనలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

ఎమ్మెల్యే పాయం నిరంతర పర్యవేక్షణ

మారెళ్లపాడు ఎత్తిపోతల పథకం పనులు వేగంగా పూర్తికావడంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రత్యేక శ్రద్ధ చూపారని స్థానికులు, పార్టీ శ్రేణులు తెలిపారు. పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అధికారులు, ఇంజినీర్లతో సమన్వయం చేసుకున్నారు. అవసరమైన సందర్భాల్లో రాత్రివేళల్లోనూ క్షేత్రస్థాయిలో ఉండి పనులను పర్యవేక్షించి, ఎదురైన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేశారు.

24 గ్రామపంచాయతీలు.. 68 గ్రామాలకు ప్రయోజనం

సీతారామ ప్రాజెక్టుకు అనుబంధంగా నిర్మించిన మారెళ్లపాడు ఎత్తిపోతల పథకం ద్వారా అశ్వాపురం మండలంలోని 24 గ్రామపంచాయతీల పరిధిలోని 68 గ్రామాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రయోజనం కలగనుంది. చెరువులు, కుంటలు నిండడంతో సాగు విస్తీర్ణం పెరగడమే కాకుండా భూగర్భజలాలు మెరుగుపడే అవకాశం ఉంది.

తుమ్మలచెరువు, మారెళ్లపాడు ప్రాంతాలు ఏడాది పొడవునా నీటితో కళకళలాడే పరిస్థితులు ఏర్పడితే వ్యవసాయంతో పాటు మత్స్య సంపద, గ్రామీణ ఉపాధి, స్థానిక వ్యాపారాలు, పర్యాటక అభివృద్ధి వంటి రంగాలకూ ఊతం లభించే అవకాశం ఉంది. వ్యవసాయ కూలీలకు ఏడాది పొడవునా ఉపాధి అవకాశాలు పెరిగే పరిస్థితులు ఏర్పడనున్నాయి.

రైతుల జీవితాల్లో కొత్త అధ్యాయానికి నాంది

సాగునీరు అందుబాటులోకి రావడం వల్ల రైతులు వర్షాధార సాగుపై ఆధారపడే పరిస్థితి తగ్గి, పంటల ఉత్పత్తి పెరిగే అవకాశం ఉంది. రైతుల ఆదాయం పెరగడంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కానుంది. పశువులకు, గ్రామీణ ప్రజలకు కూడా నీటి లభ్యత మెరుగుపడే అవకాశం ఉంది.

ఇటీవల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మారెళ్లపాడు ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించి ఆగస్టు నెలాఖరులోగా పనులు పూర్తి చేసి రైతులకు నీరు అందించాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి అడ్డంకులు ఎదురైనా పనులను పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తామని ఆయన స్పష్టం చేశారు.

29న అశ్వాపురంలో రైతుల పండుగ

ఏళ్ల తరబడి సాగునీటి కోసం ఎదురుచూస్తున్న రైతుల నిరీక్షణకు తెరపడే ఈ నెల 29వ తేదీ అశ్వాపురం రైతాంగానికి పండుగ రోజు కానుందని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు.

గోదావరి జలాలు మారెళ్లపాడు పథకం ద్వారా చెరువులు, కుంటలను తాకే క్షణం రైతుల జీవితాల్లో కొత్త ఆశలకు నాంది పలుకుతుందని పేర్కొన్నారు. రైతు బాగుంటేనే గ్రామం బాగుంటుందని.. రైతుకు సాగునీరు అందితేనే పినపాక పచ్చగా కళకళలాడుతుందని అన్నారు.

ఈ చారిత్రక కార్యక్రమంలో అశ్వాపురం మండల ప్రజలు, రైతులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని మారెళ్లపాడు ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు విజ్ఞప్తి చేశారు.

0Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *